22, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్య మతమార్పిడా?


సమస్య మతమార్పిడా? మనుషులా?

నావరకూ మనిషి ప్రాణంకన్నా, ఏదీ ముఖ్యంకాదు. మతాలు,కులాలు, వాదాలూ,ఇజాలూ ఏవీ..ఏవీ మనిషి ప్రాణంకన్నా గొప్పవి కావు. అందుకే మతమార్పిడికన్నా, ఇప్పుడు ఒరిస్సాలో పెచ్చరిల్లుతున్న హింస నన్నెక్కువగా కలవరపెడుతోంది. హిందూమత ప్రచారం చేస్తూ, మతంమారకుండా గిరిజనుల్ని కాపాడుతున్న ఆ స్వామీజీని ఎవరు చంపారో ఖచ్చితంగా ఇప్పటికీ తెలీదు. మావోఇస్టులు మేమంటుంటే, మరికొందరు ‘క్రైస్తవులే చంపారని' డిసైడ్ చేసి, దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఘటనలకి మూల కారణం బలవంతపు మతమార్పిడులు.

నవీన్ పట్నాయక్ ప్రభుత్వం స్వామీజీ హత్య వెనుకనున్న నిజాల్ని వెలికితియ్యడానికి CBI దర్యాప్తుకి ఒప్పుకోవడం లేదు. కానీ, ఈ హింస నేపద్యంలో జరిగిన దారుణాలు మాత్రం దాదాపు ముఫైరోజుల తరువాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని భయాన్ని సృష్టిస్తుంటే, మరికొన్ని మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కొన్ని షాకింగ్ గా ఉంటే మరొకొన్ని మతం పేరుతో చెలరేగే మనిషిలోని ఉన్మాదాన్ని పరిచయం చేస్తున్నాయి.

29 సంవత్సరాల క్రైస్తవ ప్రచారకురాలు (నన్) ఒక హిందూమూక చేతిలో సామూహిక మానభంగానికి గురయ్యింది. సాధారణంగా ఏసును ప్రార్థించే ఈ నన్, "నన్ను కాపాడండి" అంటూ అక్కడే ఉన్న ఒక పోలీసును దీనంగా ప్రార్థిస్తుండగా, ఏమీ చెయ్యలేక తలతిప్పేసుకున్న ఒక చట్టాన్ని రక్షించే పోలీసు సాక్షిగా ఈ ఘోరం జరిగింది. మతకల్లోలాల నేపధ్యాల ఉన్మాదస్థితిలో, ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ,మానభగం జరిగిన తరువాత "భారత్ మాతాకీ జై" అనే నినాదాల మధ్యన ఆ ప్రచారకురాల్ని నగ్నంగా ఊరేగించారు. ఈ క్షణంలో, ఆ నినాదం మీదున్న గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోయింది.

ఒక అనాధశరణాలయంపై జరిగిన దాడిలో రంజని అనే ఒక యువతి హిందూమూకకు పట్టుబడితే, దారుణంగా మానభంగం చెయ్యబడి, జీవించి వుండగానే నిప్పుపెట్టి...కాల్చి చంపబడ్డది. ఆ చంపేసిన తరువాత ఆ యువతి క్రిస్టియన్ కాదు..హిం...దూ అని తెలిసింది. తన పాపం అక్కడ తలదాచుకోవడమా? క్రిస్టియన్ లా అనిపించడమా? లేక తరువాత హిందూ అని తెలియడమా?

‘భారత్ మాత ఆర్మీ’ (బజరంగ దళ్ కి ఇదొక మారుపేరిక్కడ) సగర్వంగా, "క్రైస్తవుల్లో భయాందోళన సృష్టించి, మతం మార్పిడికోసం వీరు హిందువుల దరిదాపుల్లోకి రాకుండా చేసాం" అని TV ముఖంగా ప్రపంచానికి చాటి చెప్పారు. దాదపు 50,000 మంది శరణాలయల్లో, ప్రభుత్వ క్యాంపుల్లో మతంమార్చుకున్న గిరిపుత్రులు తమ గ్యారంటీ లేనిబ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. దాదాపు వందమందికి పైగా చనిపోతే ప్రభుత్వం 35 కు మించి లెక్క తేల్చడం లేదు.మొత్తానికి హిందూ మతాధిపత్యం నిరూపించబడింది.నాకు మాత్రం హిందూ అనిచెప్పుకోవడానికి కొంచెం అవమానంగా అనిపిస్తోంది.

రక్షణకూ,పునరావాసానికీ కేంద్రం సహాయం చెయ్యడం లేదని ఇక్కడా పొలిటికల్ స్కోరు చూసుకుంటున్నారేగానీ, ప్రజల ప్రాణరక్షణకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. కాదలేని కొన్ని సాక్షాలు ఇప్పటికి వెలుగుచూసేసరికీ, కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేసి పేర్లులేని కొందరు హిందూ మూకల్ని అర్జంటుగా అరెస్టు చేసారు.

ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా, మాస్టర్ మైండ్లంటూ కొన్ని ముస్లిం ముఖాల్ని తెరపైకితెచ్చే ప్రభుత్వాలకి ఇక్కడి "మాస్టర్ మైండ్లు" TV తెరపై కనబడ్డాకూడా వారి పేర్లు ఉచ్చరించడానికి ఎందుకు జంకుతున్నారొ అర్థంకాని ప్రశ్న.ముస్లింలో కిస్టియన్లో ఎదైనా దారుణం చేస్తే, "వాళ్ళంతా ఇంతే" అని మనం చాలా సులభంగా అనేస్తాం. కానీ, "మన హిందూ సోదరులు" ఈ ఘోరాలు చేసారండేమాత్రం, కొంచెం మింగుడుపడదు.కారణం, మనమూ హిందువులమే, దానితోపాటూ చాలా మర్యాదస్తులైన హిందువులతో మనకు చాలా పరిచయాలున్నాయి. కాబట్టి, "మనం" అలా చెయ్యగలమంటే నమ్మకం కలగదు. బహుశా, అలాగే మనకు ముస్లిం స్నేహితులూ, క్రైస్తవ మిత్రులూ ఉంటే "అందరూ అలాంటివారే" అనే అపోహ తొలగుతుందేమో!


ఏది ఏమైనా మనందరం మనుషులం. మనకు జీవించే హక్కుంది. మనుషులుగా, గౌరవప్రదంగా, అన్యాయం కాకుండా బ్రతికే హక్కుంది. ఆ హక్కుని కాలరాసే అధికారం, మతానికి,కులానికీ,ప్రభుత్వానికీ ఎవ్వరికి..ఎవ్వరికీ లేదు. ఈ ఘటనలపట్ల ఒక హిందువుగా గర్విద్దామా! ఒక మనిషిగా సిగ్గుపడదామా!! అనేవే ఆలోచించాల్సిన ప్రశ్నలు. మిగతావన్నీ అప్రస్తుతం,అనవసరం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి